కూలిన ప్రహరీ గోడ.. భయాందోళనలో వైద్య కళాశాల విద్యార్థులు….
అగంతకుల ప్రవేశానికి అవకాశం.. విషసర్పాలు, దోమల బెడద | అధికారులు వెంటనే స్పందించాలి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : శారదానగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రహరీ గోడ కొంతకాలంగా కూలిపోయి ఉండటంతో విద్యార్థినీ, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల భద్రతకు కీలకమైన ప్రహరీ గోడ కూలిన ప్రాంతం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కళాశాల ఆవరణలోకి ప్రవేశించే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కూలిపోయిన ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. కాలువలో నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిల్వ నీటి కారణంగా దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో విషసర్పాలు, ఇతర విషపూరిత జంతువులు కళాశాల ఆవరణలోకి వచ్చే ప్రమాదం కూడా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో తరగతులకు హాజరయ్యే సమయంలో, వసతి ప్రాంతాలకు వెళ్లే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన కళాశాల పరిసరాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిపోయిన ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించడంతో పాటు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే స్పందించి కూలిన ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టాలని, కాలువను శుభ్రం చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విద్యార్థినీ, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST