ఆనందంగా గణేష్ ఉత్సవాలు.. అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు…
వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి…..
శాంతియుత ఉత్సవాలకు అందరూ సహకరించాలి…
–సీపీ అంబర్ కిషోర్ ఝా…
గోదావరిఖని: గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, సమన్వయంతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. ఈ నెల 14న ప్రారంభమై 25న జరిగే గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్న ఉత్సవాల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లకు చెందిన హిందూ మత పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సీపీ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విగ్రహాల ఏర్పాటు నుంచి మండపాల నిర్వహణ, శోభాయాత్ర, నిమజ్జనం వరకు ప్రతి దశలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గణేష్ మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేసి జియోట్యాగింగ్ చేయడంతో పాటు ‘టీజీ-కాప్’ పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, 24 గంటలు ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీపీ సూచించారు. మండపాల వద్ద పోలీసులు నిరంతరం నిఘా ఉంచడంతో పాటు బ్లూ కోట్స్, పెట్రోల్ కార్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.
మండపాల ఏర్పాటు వల్ల ప్రజల రాకపోకలకు, అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్కీ డ్రాలు, జూదం నిర్వహించరాదని, బలవంతంగా చందాలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు.
విద్యుత్, అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, నాణ్యమైన వైర్లు, పరికరాలు మాత్రమే వినియోగించాలని సూచించారు. షార్ట్‌సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ బాల్స్, నీటి బకెట్లు వంటి భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
డీజేలు, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని, ఇతర మతాల మనోభావాలను కించపరిచే ప్రసంగాలు, పాటలు లేదా కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దు
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దని సీపీ సూచించారు. ఏదైనా సమాచారం నిజమా, అబద్ధమా అనే విషయాన్ని పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు. మత ఘర్షణలకు, శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిమజ్జన సమయంలో పోలీస్ శాఖ రూపొందించే రూట్ మ్యాప్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే డయల్-112 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.
“పండుగలో ఆనందం వెల్లివిరియాలి.. విషాదానికి తావుండకూడదు. అందరం సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేసి గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించుకుందాం” అని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, అదనపు డీసీపీ కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్లు, టీ.ప్రవీణ్ కుమార్, రామగుండం సీఐ కృష్ణ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు భూమేష్, చంద్రశేఖర్, సంధ్యారాణితో పాటు గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST