స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు…
ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలి….
గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని// : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎస్సీ విభాగం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్ తాళ్లపెల్లి యుగేందర్ నాయకత్వం వహించారు.
నల్ల బ్యాడ్జీలు ధరించిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైన రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవి అని అన్నారు. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించడమే కాకుండా దళిత సమాజాన్ని కించపరచడమేనని పేర్కొన్నారు.
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రలు చేసి.. అసెంబ్లీలో అమలు చేస్తున్నారంటూ ఆరోపణ
అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం, దళిత నాయకులను అగౌరవపరిచేలా వ్యూహాలు రచించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
అక్కడ తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో అమలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జరిగిన అవమానంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితి ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దళితుల విషయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు మర్చిపోలేదు బీఆర్ఎస్ పాలనలో దళితులకు ఇచ్చిన హామీలు, నేరెళ్ల ఘటన, మరియమ్మ లాకప్ డెత్ తదితర ఘటనలను కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ విభాగం నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“దళితులను అవమానిస్తే సహించేది లేదు.. రాజ్యాంగబద్ధమైన పదవులను కించపరిస్తే ఊరుకునేది లేదు.. ప్రజాస్వామ్యాన్ని అవమానించే రాజకీయాలకు తెలంగాణ గడ్డపై స్థానం లేదు” అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
తాతా మధు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విడతల వారీగా మరింత ఉధృతమైన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST