అభివృద్ధి పేరుతో రోడ్లు ధ్వంసం.. నిర్మాణం మాత్రం గాలికేనా…
?
కొత్త కూరగాయల మార్కెట్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలి…
మందులకని పోయి మాసికానికి వచ్చినట్టుంది ఎమ్మెల్యే పాలన సీపీఐ నేతల ఎద్దేవా….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని//
రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతులపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజు ఆరోపించారు. కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ శివాజీనగర్ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరిఖని ప్రాంత ప్రజలకు ప్రతిరోజూ రాకపోకలు ఉండే కొత్త కూరగాయల మార్కెట్ మార్గం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు ఏడాదిన్నర కాలంగా రోడ్డు ధ్వంసమై గుంతలమయంగా మారడంతో పాటు వర్షపు నీరు నిలిచిపోతుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్న రోడ్లను ధ్వంసం చేసి కొత్త రోడ్లు నిర్మిస్తామని చెప్పి వెళ్లిపోతున్నారే తప్ప, పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కుండీలు, చాంబర్లు ఆరు నెలలు కూడా గడవకముందే ధ్వంసం కావడం చూస్తే పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ఆరోపించారు.
“రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తుంటే మందులకని పోయి మాసికానికి వచ్చినట్టుంది” అంటూ వారు ఎద్దేవా చేశారు. రూ.800 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే, మేయర్ ఒక్కసారి ఆకాశం నుంచి భూమిపైకి వచ్చి ప్రజల సమస్యలను పరిశీలిస్తే జరుగుతున్న అభివృద్ధి ఏంటో కళ్లకు కనిపిస్తుందని దుయ్యబట్టారు.
రామగుండం కార్పొరేషన్లో గత మూడేళ్లుగా “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డును వెంటనే పూర్తి చేయడంతో పాటు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసిన అన్ని సీసీ రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం కొనసాగిస్తే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
సీపీఐ శివాజీనగర్ శాఖ కార్యదర్శి రాణవేణి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు రేణిగుంట్ల ప్రీతం, పోతరాజు నాగరాజు, సాధుల శివ, షేక్ చాంద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST