ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సెప్టెంబర్ 16 వరకు అవకాశం….
నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసులు.. 1.49 లక్షల నోటీసులు జారీ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి : సర్ ప్రక్రియలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16వ తేదీ వరకు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితాలో లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియలో చేపడుతున్న చర్యలు, ముసాయిదా ఓటరు జాబితా, క్లెయిమ్లు, అభ్యంతరాలు, నోటీసులు, విచారణ తదితర అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
నో మ్యాపింగ్, అనామలీస్గా గుర్తించిన ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,194 నోటీసులు రూపొందించగా, వాటిలో 58,313 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేసినట్లు వెల్లడించారు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి ఏడు రోజుల అనంతరం సంబంధిత ఎన్నికల నమోదు అధికారి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తామని తెలిపారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా విచారణకు హాజరై తమ ఓటు హక్కుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. ఓటు హక్కును క్లెయిమ్ చేసుకునే సమయంలో భారత ఎన్నికల సంఘం ఆమోదించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని ఆధారంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు తన పేరు, వయస్సు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో తప్పులు ఉన్నా, అర్హత కలిగినప్పటికీ పేరు లేకపోయినా, అర్హత లేని పేరు ఉన్నట్లు గుర్తించినా నిబంధనల ప్రకారం క్లెయిమ్లు, అభ్యంతరాలను సమర్పించాలని కోరారు.
సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణకు హాజరయ్యే విధానం, సమర్పించాల్సిన ఆధార పత్రాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్లకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా అవసరమైన క్లెయిమ్లు, అభ్యంతరాలను గడువులోగా సమర్పించాలని సూచించారు.
క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి, అవసరమైన చోట విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు విజయ్, ఐటీ సాంకేతిక నిపుణులు కిరణ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST