సబ్బితం వాటర్‌ఫాల్స్‌ అభివృద్ధికి చర్యలు.

Sakshitha news

సబ్బితం వాటర్‌ఫాల్స్‌ అభివృద్ధికి చర్యలు…..

— ప్రభుత్వ విప్ విజయరమణ రావు…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. మొక్కల పంపిణీ, నాటడం, సంరక్షణకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందిస్తూ మొక్కల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మొక్కల పెంపకం, సంరక్షణకు సంబంధించిన వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు.

వచ్చే ఏడాది నాటికి సబ్బితం జలపాతాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అవసరమైన చర్యలు చేపడతామని విజయరమణ రావు తెలిపారు. సబ్బితం ప్రాంతాన్ని పచ్చదనంతో నింపడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.