ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి…

Sakshitha news

ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి…

మ్యాపింగ్ లేని, అనామలీస్ ఉన్న ఓటర్లకు నోటీసులు తప్పనిసరి….

నోటీసు జారీ చేసిన 7 రోజుల తర్వాతే విచారణ చేపట్టాలి…..

— రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి…

సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి,పెద్దపల్లి// : ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా మ్యాపింగ్ లేని ఓటర్లు, వివిధ రకాల అనామలీస్ ఉన్న ఓటర్లకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జనరేషన్, నోటీసుల జారీ, విచారణలు, డేటా నమోదు తదితర అంశాలపై సోమవారం అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఐడీఓసీ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణశ్రీతో కలిసి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించిన సుదర్శన్ రెడ్డి, ఇప్పటివరకు జనరేట్ చేసిన నోటీసులు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, పూర్తయిన విచారణల వివరాలను పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌లో ఏ దశలోనూ జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

మ్యాపింగ్ లేని ఓటర్లు, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసులు జనరేట్ చేసి సంబంధిత ఓటర్లకు తప్పనిసరిగా జారీ చేయాలని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన సమయం కల్పించి విచారణ నిర్వహించాలని సూచించారు. నోటీసు జారీ చేసిన అనంతరం ఏడు రోజుల వ్యవధి పూర్తయిన తర్వాతే నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

విచారణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ, అర్హత కలిగిన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, వారికి అవసరమైన సమాచారం అందిస్తూ వారి సూచనలు, అభ్యంతరాలను నిబంధనల మేరకు పరిశీలించాలని ఆదేశించారు.

డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హియరింగ్ పూర్తయిన అనంతరం సంబంధిత వివరాలను డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ గంగయ్య, ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.