రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి….

Sakshitha news

రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి….

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి….

–మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి, : జిల్లాలో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న 24 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.

ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌లతో కలిసి భారీ వర్షాల పరిస్థితిపై జిల్లా అధికారులతో మంత్రి వీడియో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని ఒక్క చెరువు కూడా గండి పడకుండా లేదా తెగిపోకుండా సాగునీటి శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పూర్తి నీటిమట్టానికి చేరిన చెరువులను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించినా వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించి అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.

నీట మునిగిన కాజ్‌వేలు, లోతట్టు రహదారులను వెంటనే రాకపోకలకు మూసివేసి, అక్కడ పోలీసు, రెవెన్యూ, గ్రామపంచాయతీ సిబ్బందితో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్లను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పశువుల నష్టం వంటి ఘటనలను తహసీల్దార్లు వెంటనే పరిశీలించి పరిహార ప్రతిపాదనలు సిద్ధం చేసి బాధితులకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రానున్న 24 గంటలు అత్యంత కీలకమని పేర్కొన్న మంత్రి, గ్రామ సర్పంచులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

ముంపునకు గురైన కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ ఆహారం, తాగునీరు, వైద్యం, వసతి తదితర అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను గుర్తించి వాటిలో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించి దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అత్యవసరంగా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యవసర సమాచారం వెంటనే జిల్లా నియంత్రణ కేంద్రానికి చేరవేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో గంగయ్య, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top