వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పి.నేహారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది||
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్ జడ్ నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కట్టిన కాంక్రీట్ ప్రహరీగోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని తెలిపింది.
తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయింది.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ కు సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది!