నియోజకవర్గాల సమస్యలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు
వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి
ప్రజల తరుఫున నిలబడని వారికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట:ప్రజాస్వామ్యయుతంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా, నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించకుండా, గౌరవ వేతం పేరుతో ప్రజాధనం తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారని, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే వీధి నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బాలాజి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు..
స్వయం కృతాపరాధం వైసీపీని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం వైసీపీ అధినేత జగన్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శమని బాలాజి అన్నారు. పేదల ముసుగేసుకున్న పెత్తందారీ జగన్ను ప్రజలే తరిమికొట్టారని వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే దాన్ని తృణీకరించటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ప్రజల తరపున నిలబడని వారికి అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత కూడా లేదన్నారు.