SAKSHITHA NEWS

ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు 2024కు ఎంపికైన వై పద్మ వెంకటేశ్వర్లు

శంకర్‌పల్లి: సెప్టెంబర్ 05: శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వై పద్మ వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అందజేసే ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయురాలుగా పద్మ నిలిచారు. గురువారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ పాఠశాలలో పద్మను శాలువాతో ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. 2014 – 15లో ఆమె బీఈడీ, 2022 – 24లో పీజీ పూర్తి చేశారు.

మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు పద్మ బోధనా నైపుణ్యాన్ని కొనియాడారు. గత 22 ఏళ్లుగా 1 నుండి 7వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో ఆమె 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా క్వారీ కార్మికులు, వ్యవసాయ కూలీలు స్థానికంగా చాలా మంది పిల్లలు చదువు మానేసినప్పటికీ, టీచర్ పద్మ.. తల్లిదండ్రులకు, విద్యార్థులకు అండగా నిలిచి వారికి సలహా, ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వారి విద్యను నిరంతరాయంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన పద్మకు ప్రధానోపాధ్యాయురాలు శాంతి, బోధనా సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పంచాయతీ సెక్రెటరీ జీవన్, కారోబార్ రఫీ, రాజశ్రీ రాజేష్ గౌడ్, విజయలక్ష్మి, విద్యార్థులు, అంగన్వాడి కార్యకర్తలు, అక్షయపాత్ర బృందం పాల్గొన్నారు.


SAKSHITHA NEWS