మార్కాపురంకు మెడికల్ కాలేజీ ఒక వరం… పనులు ఎలాజరుగుతున్నాయో ఒకసారి వెళ్లి పరిశీలించుకోండి: ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్బంగా మార్కాపురం ఎమ్మెల్యే నివాసం లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ చంద్రబాబుకు సవాలు విసిరారు. “మార్కాపురంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీ హయాంలో కేవలం స్థల సేకరణ మాత్రమే చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు వేగంగా జరుగుతున్నాయి. మీకు చేతనైతే టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగుదాంరండి,” అని సవాలు విసిరారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున.
2004 నుంచి 2009 మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తిచేశారని ఎమ్మెల్యే అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్ట్ పనులను అనుయాయులు ఇచ్చి వాటిని ఏటీఎంలలాగా మార్చి వాడుకున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే అక్టోబర్ లో వెలుగొండను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని ప్రకటించారు.
ఇప్పుడు మార్కాపురంను జిల్లా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ తాను ముక్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కాపురంనికి ఏమి చేసారో ముందు చెప్పాలని అన్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదనపు జిల్లాల అవకాశం ఉంటే తప్పక ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చే ముందు మ్యానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని కానీ వాటిల్లో ఎన్ని హామీలు అమలుచేశారో ఆత్మపరిశీలన చేసుకోమని కోరారు. 2019లో అధికారంలోకి వచ్చేముందు జగన్ ఇచ్చిన హామీలను అన్నింటిని 98 శాతం అమలుచేసి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారని, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ కి బుద్ధి చెప్తారు అని అన్నారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎంతోమందికి స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు. కానీ మార్కాపురంలో మాత్రం మీ పార్టీ నాయకుడు ఇచ్చిన అబద్ధపు స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి మీకు ఏర్పడిందని అన్నారు. “మార్కాపురంకు మెడికల్ కాలేజీ ఒక వరం. పనులు ఎలాజరుగుతున్నాయో ఒకసారి వెళ్లి పరిశీలించుకోండి,” అని ఎమ్మెల్యే తెలిపారు.