నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో…?!
వైసీపీ నాయకుడు జగన్ ప్రస్తుత రొటీన్ ఏంటంటే… తాడేపల్లి, బెంగళూరు, లండన్ మధ్య ఆసులో కండెలాగా తిరగడం… రాజకీయాలు చేయడానికి శవాల కోసం అన్వేషించడం… కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా విషం కక్కాలా అని ఆలోచించడం, జైల్లో పడుతున్న తన పార్టీ నాయకులను పరామర్శించి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద నోరు పారేసుకోవడం… ఇదీ ఆయన టైమ్ టేబుల్. ఈ టైమ్ టేబుల్‌లో భాగంగానే జగన్ బుధవారం నాడు గుంటూరు జైలుకు వెళ్ళనున్నారన్న వార్తలు వస్తున్నాయి. 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా వున్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. ఆటలో అరటిపండు, పాటలో పనసపండు లాంటి అవుతు శ్రీనివాసరెడ్డిని పక్కన పెడితే, జగన్ ఇప్పుడు గుంటూరు జైలుకు ముఖ్యంగా వెళ్తున్నది నందిగం సురేష్‌ని పరామర్శించడానికి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, నిజానికి జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది, నందిగం సురేష్‌తో మిలాఖత్ అవుతున్నది ఆయన్ని పరామర్శించడానికా? లేక తనతో మిలాఖత్ అయి చేసిన ఘోరమైన నేరం విషయంలో తన పేరు బయట పెట్టొద్దని బెదిరించడానికా? ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.
అధికారంలో వున్నంతకాలం జగన్ తన విధ్వంస కార్యకలాపాలను నిర్వహించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను దారుణంగా వాడేశారు. వాళ్ళని వీధి రౌడీలకంటే కింద స్థాయికి దిగజార్చేసి, తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడటానికి, దాడులు చేయడానికి ఉపయోగించారు. అందులో భాగంగానే నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. రాజకీయంగా ఏ స్థాయీ లేని తనను ఎంపీ చేసిన జగన్ అంటే నందిగం సురేష్‌కి చెప్పలేనంత అభిమానం. అందుకే జగన్ చూసిరమ్మంటే కాల్చి వచ్చేస్తూ వుంటారు. అధికారంలో వున్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నో చేసిన నందిగం సురేష్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చెప్పినట్టే చేశారు. అదేంటో తెలుసా? కృష్ణా బ్యారేజ్ ధ్వసం అయ్యే విధంగా బోట్లను వదలటం.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం బ్యారేజ్‌ని బోట్లు ఢీకొనడం వెనుక జగన్ హస్తం వుంది. జగన్ ఆదేశించారు. వైసీపీ నాయకులు ఆచరించారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి బోట్లను అడ్డంగా పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలని సజ్జలకు జగన్ చెప్పారు. అదే విషయాన్ని నందిగం సురేష్, తలశిల రఘురాంలకు సజ్జల వాట్సాప్ కాల్ ద్వారా చెప్పారు. వరద నీటిలో బోట్లను వదిలిన అనంతరం పని అయిపోయిందని సజ్జలకి తలశిల రఘురాం, నందిగం సురేష్ వివరించారు. కాబట్టి, ప్రకాశం బ్యారేజ్‌ని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసే కుట్ర జగన్ దగ్గర ప్రారంభమైంది. సజ్జల, నందిగం సురేష్, తలశిల రఘురాం తదితరుల ద్వారా అమల్లోకి వచ్చింది. కొండపైన కొలువుండి అంతా చూస్తు్న్న కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఈ ఘోరం జరగక్కుండా ఆగింది.
ప్రస్తుతం గుంటూరు జైల్లో వున్న నందిగం సురేష్ చాలా డిప్రెషన్లో వున్నట్టు తెలుస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి.. ఇప్పుడు ‘ఎస్ బాస్’ అంటూ ఏ అడ్డమైన పని చెప్పినా చేసే ఒక కిరాయి రౌడీ స్థాయికి దిగజారి జైల్లో పడ్డానే అన్న బాధలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక పరిస్థితిలో ఆయన ఇక ఇలాంటి జీవితం వద్దు అనుకుని మారిపోతే పరిస్థితి ఏమిటి? అప్రూవర్‌గా మారిపోయి తనతో ఈ నేరాలన్నీ చేయించింది జగన్ అనే విషయాన్ని స్పష్టంగా చెబితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? జగన్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ప్రకాశం బ్యారేజ్ ఘటన వెనుక వున్నది నందిగం సురేష్ హస్తం అనే విషయం బయటపడుతూ వుండగానే, అప్పటి వరకు లేని గుంటూరు జైలుకు వెళ్ళి నందిగం సురేష్‌ని పరామర్శించే ప్రోగ్రామ్‌ని సడెన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది నందిగం సురేష్‌తో మిలాఖత్ అయి పరామర్శించడానికి కాదు… ప్రకాశం బ్యారేజ్ బోట్ల ప్రమాదం విషయంలో తనతో నందిగం సురేష్ మిలాఖత్ అయిన విషయం బయటపెట్టొద్దని బెదిరించడానికే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.