అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము
ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తాము
కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను ప్రారంభించిన నారా భువనేశ్వరి
కుప్పం : కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతమే చేయడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు కోర్సులను భువనేశ్వరి ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులు, పలు ఉత్పత్తులను పరిశీలించారు. స్కిల్ సెంటర్లో ఉన్న పరికరాలు, వాటి పనితీరు, ఉత్పత్తుల మార్కెటింగ్, తయారీ ఖర్చు, ఆదాయం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ..ఇప్పటి వరకు కుప్పం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో 165 మంది శిక్షణ తీసుకున్నారు.
ఎంత మంది మహిళలు వచ్చినా వారికి శిక్షణ ఇప్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు నుండి ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నాం. మహిళలు కుట్టిన వస్త్రాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జ్యూట్ బ్యాగులు, గాజుల తయారీలోనూ శిక్షణ అందిస్తున్నాము. అలాగే ఉచితంగా డీఎస్సీ కోచింగ్ తో పాటు మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. ప్రస్తుతం ఈ డీఎస్సీ శిక్షణా కేంద్రంలో 150 మంది శిక్షణ పొందుతున్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకానుంది. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇప్పటికే హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అక్కడికి వచ్చి ఉచితంగా కోచింగ్ తీసుకోవచ్చు. కుప్పంలో పేద విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు ఢిల్లీకి చెందిన క్రాక్ అకాడమీ ముందుకు వచ్చింది. త్వరలో అది కుప్పంలో ప్రారంభమవుతుంది. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాము.