నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, మావోయిస్టులపై ఎడతెగని పోరాటం సాగిస్తోందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కూడా మావోయిస్టులపై ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రధాని నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే భారత్ నుంచి మావోయిస్టులను నిర్మూలిస్తామని నిశ్చయంగా చెబుతున్నానని అమిత్ షా అన్నారు..
మూడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 80 మందికి పైగా మావోయిస్టులను నిర్మూలించామని, 2019 నుంచి ఇప్పటి వరకు 250 క్యాంపులు ఏర్పాటు చేశామని, భద్రతను పటిష్టపరిచామని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టులతో పాటు 29 మంది హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మరణించడం ఇదే తొలిసారి. 2024 నుంచి బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్లలో 79 మంది మావోలు మరణించారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు..