SAKSHITHA NEWS

మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. మ‌రిన్ని సీఐఐ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తాం : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : వ్యాపారులు, పెట్టుబ‌డుల‌కు రాష్ట్రంలో అద్భుత‌మైన వాతావ‌ర‌ణం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల బ‌యో ఏషియా( Bio Asia ) స‌ద‌స్సు విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకున్నాం అని తెలిపారు. మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. మ‌రిన్ని సీఐఐ( CII ) స‌ద‌స్సులు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బేగంపేట‌లో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక స‌మావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబ‌డుల‌కు విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియ‌న్ డాల‌ర్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎన్నో అనుకూల‌త‌లు, బ‌లాలు ఉన్నాయి. 9 బిలియ‌న్ టీకాలు హైద‌రాబాద్‌లోనే ఉత్ప‌త్తి అవుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్ప‌త్త‌య్యే టీకాల్లో 50 శాతం హైద‌రాబాద్‌లోనే త‌యారు అవుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌పంచంలో అతిపెద్ద స్టెంట్ త‌యారీ కేంద్రం మ‌న డివైజెస్ పార్కులోనే ఉంద‌న్నారు. తెలంగాణ‌లో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికే హైద‌రాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ అత్యుత్త‌మ వేదిక‌..

ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒకే చోట అత్యుత్త‌మ వ‌స‌తులు క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్ వ‌ద్ద అతిపెద్ద మెడిక‌ల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాల‌జీ రంగానికి హైద‌రాబాద్ అత్యుత్త‌మ వేదిక‌గా మారింద‌న్నారు. ప్ర‌యివేటు రంగంలో ఉప‌గ్ర‌హాల త‌యారీ మొట్ట‌మొద‌ట‌గా హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. ప్ర‌యివేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్ర‌తినిధుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. డ్రోన్ల ద్వారా ఔష‌ధాలు స‌ర‌ఫ‌రా చేసే వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని కేటీఆర్ చెప్పారు.

హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ ప్ర‌సిద్ధ సంస్థ‌లు..

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ సంస్థ‌లు హైద‌రాబాద్‌లో త‌మ కేంద్రాల‌ను ఏర్పాటు చేశాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థ‌లు హైద‌రాబాద్‌లో అతి పెద్ద ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని వివ‌రించారు. విభిన్న కంపెనీలు మాత్ర‌మే కాదు.. విభిన్న‌మైన ఆచారాలు, ఆహారం కూడా హైద‌రాబాద్‌లో క‌నిపిస్తాయ‌న్నారు.

ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు..

ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు రానున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. ముందుచూపుతో ఈవీ, బ్యాట‌రీల త‌యారీ రంగంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ ప‌త్తికి దేశంలో మంచి డిమాండ్ ఏర్ప‌డింద‌న్నారు. టెక్స్‌టైల్ రంగంలోనూ పెట్టుబ‌డుల‌కు విస్తృత ప‌రిధి ఉంద‌న్నారు. భారీ స్థాయిలో కాక‌తీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. కొంగ‌ర‌క‌లాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ‌కు 200 ఎక‌రాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌న్నారు. హైద‌రాబాద్ చుట్టూ ఉండే ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి స‌మ‌స్య కూడా లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.


SAKSHITHA NEWS