వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం….
నాలాల పూడికతీత, రోడ్లు, కాలువల పనులను పరిశీలించిన మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నగర పాలక సంస్థ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు నాలాల పూడికతీత పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గత నాలుగు నెలలుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రధాన నాలాల్లో పూడికతీత చేపట్టామని, నాలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించడం వల్ల వర్షపు నీరు సాఫీగా ప్రవహించి వరద ముప్పు తగ్గుతుందని చెప్పారు.
రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంక్రీట్ కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గిన నేపథ్యంలో రోడ్ల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేశామని, అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మేయర్ ఉదయం 38, 39 డివిజన్లలో ప్రవహిస్తున్న ప్రధాన నాలాలో జరుగుతున్న పూడికతీత పనులను స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి పరిశీలించారు. అనంతరం 46వ డివిజన్‌లో ట్రాన్స్‌జెండర్లకు కేటాయించిన ఇంటి స్థలాలను సందర్శించి, ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా శుభ్రం చేసి చదును చేయాలని అధికారులను ఆదేశించారు.
తర్వాత మేడిపల్లి, పీకే రామయ్య కాలనీల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న రోడ్ల పనులు, ప్రతిపాదిత కాలువల నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పీజీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి వరకు రహదారి విస్తరణకు ఉన్న అవకాశాలను కూడా మేయర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, నగరపాలక సంస్థ టీపీఓ నవీన్, ఏఈ తేజస్విని, నాయకులు మడిపెల్లి మల్లేశం, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
