సంక్షేమం,అభివృద్ధి,సామాజిక న్యాయంతో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం….
–విప్ విజయరమణారావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం 200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
జూన్ 2 నుంచి కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పోషకుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమన్నారు.
విద్యారంగంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించామని చెప్పారు.
జిల్లాలో 1,54,598 మంది రైతులకు రూ.114.04 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని, 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.767.09 కోట్లతో కొనుగోలు చేశామని తెలిపారు. రైతు బీమా కింద 1,002 మంది రైతు కుటుంబాలకు రూ.44.85 కోట్ల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా 1,39,760 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 74,157 వ్యవసాయ కనెక్షన్లకు రూ.382.65 కోట్ల సబ్సిడీతో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా జిల్లా మహిళలు రూ.193.35 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.507 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి రుణాలు అందించినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 6,451 ఇళ్ల నిర్మాణాలకు రూ.126 కోట్లు విడుదల చేశామని, రెండో విడతలో మరో 6 వేల ఇళ్ల మంజూరుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే 93,659 మంది లబ్ధిదారులకు రూ.252.22 కోట్ల చేయూత పింఛన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 14,983 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించామని, జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ, డీసీపీ రాంరెడ్డి, డీఆర్ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
