SAKSHITHA NEWS

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.

కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు.

ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వబోమంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను ఆందోళనకారులు గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలపై సమాధానం చెప్పాలంటూ పట్టుబ్టటారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

వారి ఆందోళన నేపథ్యంలో విశాఖపట్నంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సీఐటీయు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో రోడ్లపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల పాటు రాస్తారోకో కొనసాగింది.


SAKSHITHA NEWS