గత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వీర్లపల్లి గ్రామం తీవ్రంగా నష్టపోయింది ….
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,పెద్దపల్లి సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా 21వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టూ పరిశ్రమల ప్రభావం, గత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వీర్లపల్లి గ్రామం తీవ్రంగా నష్టపోయిందన్నారు. సింగరేణి గనుల ఏర్పాటు, ఎన్టీపీసీ రైల్వే లైన్ నిర్మాణం, ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్ధరణ సమయంలో సరైన ప్యాకేజీ అందక గ్రామానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తాను ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి సహకారంతో గ్రామస్తులకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు, ఇందిరమ్మ పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు స్థానికంగా అన్ని వసతులు కల్పించనున్నామని హామీ ఇచ్చారు.
గ్రామంలో మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు సమగ్ర మురుగు కాలువ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలువ నిర్మాణం కోసం ప్రైవేట్ స్థలం అవసరమైతే యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రహరీ ఆనుకుని ఉన్న వీర్లపల్లి గ్రామంతో పాటు ఎల్కలపల్లి గేట్, లక్ష్మీపురం, చైతన్యపురి కాలనీలను సంస్థ సామాజిక బాధ్యత నిధుల కింద అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో భాగంగా స్థానికులు ఆర్‌ఎఫ్‌సీఎల్ కారణంగా ఏర్పడుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రహరీ అవతల పెరిగిన తుప్పలు, పొదలను తొలగించి విషసర్పాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాంట్ శుభ్రపరిచే సమయంలో నీరు ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే గ్రామంలోని స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెప్మా ద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని చిన్న, పెద్ద కాలువల్లో పెరిగిన తుప్పలను తొలగించి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు. స్థానిక స్వశక్తి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మెప్మా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
