సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలి… ఉప ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల…
కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోల్ బెల్ట్ పర్యటనకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలోని 53 విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు.
నామమాత్రంగా రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. పక్కనే ఉన్న ఎన్టీపీసీ సంస్థలో పని చేసే కార్మికులతో పోలిస్తే, అలాగే మున్సిపల్ ఉద్యోగులతో పోలిస్తే సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చాలా తక్కువ వేతనాలు, అలవెన్సులు అందుతున్నాయని పేర్కొన్నారు.
తక్కువ వేతనాల కారణంగా కార్మికులు పిల్లల చదువులు, ఇంటి అద్దెలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు, కనీస హక్కులు కూడా అమలు కావడం లేదని విమర్శించారు. సెలవులు, పండుగ సెలవులు వంటి చట్టబద్ధ హక్కులు కూడా అందడం లేదన్నారు.
సింగరేణి సంస్థ లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోందని, వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కనీస వేతనాల ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి న్యాయం చేయాలని కోరారు.
వే-బ్రిడ్జిల వద్ద పని చేస్తున్న లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు, సులభ్, నర్సరీ, స్టాండ్ బంకర్స్ వంటి విభాగాల్లో పని చేస్తున్న కార్మికులను కూడా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనుభవం కలిగిన నైపుణ్య కార్మికులకు నైపుణ్య వేతనాలు అందేలా టెండర్ విధానాల్లో మార్పులు చేయాలని, ఐదేళ్ల సేవ కలిగిన కార్మికులకు అన్‌స్కిల్డ్ వేతనాల స్థానంలో సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని కోరారు.
ప్రతి కార్మికునికి అలవెన్సులు, జాతీయ సెలవులు, లీవులు, ఇతర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని, 2013 ఒప్పందం ప్రకారం హైపవర్ కమిటీ వేతనాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 22 ప్రకారం వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని కోరారు.
