ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలి
జాబ్ కేలండర్-2026 భాగంగా రెండో దశలో 3,168 ఉద్యోగాల భర్తీ
సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల
జాబ్ కేలండర్-2026పై సమీక్షలో మంత్రుల బృందం దిశానిర్దేశం
ఉండవల్లి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ కేలండర్-2026పై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జాబ్ కేలండర్-26లో విడుదల చేసిన 10,060 ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే మొదటి దశ కింద వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15న నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో దశ కింద 3,168 పోస్టుల భర్తీకి ఆగష్టు 15 నోటిఫికేషన్ విడుదల చేయాలని మొదట నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో వివిధ సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల వినతి మేరకు జాప్యం జరిగింది. దీంతో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 15న 3,4 దశల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జాబ్ కేలండర్ లో భాగంగా ఒకేసారి మూడు, నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మూడో దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్ మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని సీఎం గారు నిర్దేశించారని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రెండో దశలోని 2,388 ఉద్యోగాల్లో 2,225 పోస్టులు హోంశాఖలో భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మొత్తంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 పూర్తి ఖాళీల వివరాలను ఆరో తేదీన జరిగే కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రవి సుభాష్, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
