పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం బక్రీద్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి…
— పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:మంచిర్యాల,
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.
మంచిర్యాల జోన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తనిఖీ విధానాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే చెక్‌పోస్ట్‌లో నిర్వహిస్తున్న వివరాల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాలు మరియు పశువుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు.
అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
పండుగ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
