కాలానుగుణంగా యువత తమ ప్రతిభాపాటవాలు మెరుగుపరుచుకోవాలి : ప్రత్తిపాటి
- గతంలో ఐటీని ప్రోత్సహించిన మన ముఖ్యమంత్రి..ఇప్పుడు ఏఐ..క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రమోట్ చేస్తున్నారు : ప్రత్తిపాటి.
- గ్రామీణ యువత ఆత్మన్యూనతను వీడి.. లక్ష్యసాధన దిశగా వడివడిగా అడుగులేస్తే అనుకున్నది సాధించగలరు : ప్రత్తిపాటి
- కంపెనీలు..పరిశ్రమలు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి : ప్రత్తిపాటి
- రాష్ట్రస్థాయి జాబ్ మేళాను ప్రారంభించి యువతను ఉద్దేశించి మాట్లాడిన మాజీమంత్రి.
గ్రామీణ యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని… విద్యతో పాటు ఇతర ప్రతిభాపాటవాలు పెంచుకుంటేనే యువత తాము అనుకున్నరంగాలలో రాణించగలరని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రూరల్ మండలం మద్దిరాలలోని సాధినేని చౌదరయ్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జాబ్ మేళాను ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి యువతీయువకుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
పరిస్థితులకు తగినట్టు ప్రతిభను పెంపొందించకోవడంలో తెలుగువారే ముందుంటారు
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎంతో ముందుచూపుతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి, తెలుగు యువత అపారమేథస్సును ప్రపంచానికి పరిచయం చేశారని, ఇప్పుడు ఆయనే ఏ.ఐ (ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్), క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా మార్పుల్ని గమనించి తమలోని ప్రతిభను మెరుగుపరుచుకోవడంలో తెలుగువారిదే అగ్రస్థానమని ప్రత్తిపాటి తెలిపారు. ప్రపంచంలో భారతీయులకు ఒకప్రత్యేక గౌరవమర్యాదులన్నాయని, వారిలో తెలుగువారికి మరింత గుర్తింపు లభిస్తుందంటే కారణం.. మన మేథస్సు..మనల్ని సమర్థంగా తయారుచేసే నాయకత్వమేనని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
గ్రామీణ యువత నైపుణ్యాలు పెంచుకొని లక్ష్యసాధన దిశగా సాగాలి
గ్రామీణ ప్రాంత యువత ఆత్మన్యూనతకు లోనుకాకుండా.. తమకునచ్చిన రంగంలో రాణించే దిశగా తగిన శిక్షణ తీసుకోవాలని, ఆంగ్లంపై పట్టుపెంచుకోవడం ఎవరికీ కష్టంకాదని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడితే అందరూ మెరికల్లా తయారవుతారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఉద్యోగం రావడంలేదన్న నిరాశానిస్పృహలు వీడి.. యువత లక్ష్యసాధన దిశగా వడివడిగా అడుగులేయాలన్నారు. కసి..పట్టుదల… లక్ష్య సాధన ఉంటే గ్రామీణ యువత ఏదైనా సాధించగలదని ప్రత్తిపాటి తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలు కూడా అభ్యర్థుల ఎంపికలో గ్రామీణ యువతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే కొన్ని నెలలు వారికి సరైన శిక్షణ ఇచ్చి, వారితో పనిచేయించుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సాధినేని హనుమంతరావు, డైరెక్టర్ శివప్రసాద్, ఎంఈవో నరసింహారావు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, మాలెంపాటి సుబ్బారావు, గట్టినేని రమేష్, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా నైపుణ్యాధికారి ఈ.తమ్మజీరావు, ఆడిషన్ అధికారి రామాంజనేయులు, కోఆర్డినేటర్ సురేష్ తదితరులున్నారు.
