ఓటమి భయంతోనే పోలీసులపై వైసీపీ ఆరోపణలు

Sakshitha news

ఓటమి భయంతోనే పోలీసులపై వైసీపీ ఆరోపణలు

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: రాష్ట్రంలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా… ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న తరుణంలో వైసీపీ నాయకులే అరాచకాలకు పాల్పడి పోలీసు శాఖపై ఆరోపణలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ హితవు పలికారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల నేపథ్యంలో సురేంద్ర కుమార్ మంగళవారం చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అడ్డా అని ప్రగల్బాలు పలికే పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య యుతంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టిందన్నారు. అయితే
ఓటమి భయంతో వైసీపీ వాళ్ళు గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డితో సహా నాయకులు చంద్రబాబు నాయుడు పైనా, పోలీస్ అధికారులపైనా, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ పైన తప్పుడు ఆరోపణలు , అసత్యప్రచారాలు పెద్దఎత్తున చేసారని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళే దాడులు , దౌర్జన్యాలు చేస్తూ వాటిని టిడిపి నాయకులకు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసారని దుయ్యబట్టారు. ప్రజలను భయం గుప్పెటలో పెట్టి పులివెందులలో ఇప్పటివరకు ఎన్నికలను ఏకపక్షంగా జరిపించుకొనే సంస్కృతికి కూటమి ప్రభుత్వం పూర్తిగా చెక్ పెట్టి ప్రజలకు ధైర్యంతో ఓటు వేసే పరిస్థితి కల్పించిందని పేర్కొన్నారు. దేశంలోనే జగన్ రెడ్డిని మించిన అప్రజాస్వామిక వాది , అరాచకవాది, దోపిడిదారు మరొకరు లేరని….. ఇకపై అలాంటి రాజకీయ ముసుగు నాయకులు ఉండరనే విషయం ప్రజలకు బాగా తెలుసునన్నారు.


తెలుగుదేశం పార్టీ 1983 ఆవిర్భావం నుంచీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య ప్రజా తీర్పును గౌరవిస్తుందని సురేంద్ర పేర్కొన్నారు. అదే తరుణంలో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంను గౌరవిస్తుందని చెప్పారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా , నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా అధికారులు, పోలీసులు సమర్ధవంతమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిపించారో , ఎన్ని అరాచకాలు చేశారో , అభ్యర్థులను ఏవిధంగా భయపెట్టి నామినేషన్లు వేయనీయకుండా చేశారో , నామినేషన్ల పత్రాలను ఏవిధంగా లాక్కొని చించి పడేశారో , దొంగ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణలు చేశారో రాష్ట్ర ప్రజలు చూసారని వెంకిటీల గుర్తు చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉప ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయో కూడా ప్రజలు చూస్తున్నారన్నారు.
30 ఏళ్ళ తర్వాత పులివెందులలో ఓటర్లు ప్రజాస్వామ్య ఎన్నికలను రుచి చూస్తున్నారని తెలిపారు.