సన్న బియ్యం అర్హులకే అందాలి…

Sakshitha news

సన్న బియ్యం అర్హులకే అందాలి…

అక్రమాలకు తావులేకుండా కఠిన నిఘా: అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, జిల్లాలో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం అర్హులైన బీపీఎల్ కుటుంబాలు, విద్యాసంస్థలకు మాత్రమే చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అదనపు రెవెన్యూ కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్ వంటి అక్రమాలకు ఏమాత్రం తావివ్వకుండా నిరంతర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుంచి అన్ని చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. ఆహార భద్రతా కార్డులోని ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని 14 మండలాల పరిధిలో 410 చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,46,981 రేషన్ కార్డుల ద్వారా 7,17,898 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని, కొత్తగా 30,909 రేషన్ కార్డులు మంజూరు చేసి 88,357 మందిని చేర్చినట్లు వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటా కింద జిల్లాకు 13,645.968 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం 43 ఫెయిర్ ప్రైస్ షాపుల డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి రేషన్ కార్డుదారుడి “ఈ కె వై సి” ప్రక్రియను జూలై 31లోపు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలోని 7,16,498 మంది లబ్ధిదారుల్లో 5,89,738 మంది (82.31 శాతం)”ఈ కె వై సి” పూర్తి చేసుకున్నారని, మిగిలిన వారందరూ గడువులోపు పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో గుర్తించిన 7,490 మంది అనుమానిత లబ్ధిదారుల్లో 4,894 మంది ధృవీకరణ పూర్తయిందని, మిగిలిన వారి ధృవీకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన 62 కేసులపై సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన 31 కేసుల్లో 579.80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని రూ.25.89 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఎల్పీజీకి సంబంధించిన 31 కేసుల్లో 45 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,953 అర్హ కుటుంబాలకు ఇప్పటివరకు 4,73,691 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.1,403.45 లక్షల సబ్సిడీ అందించినట్లు అధికారులు సమావేశంలో వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top