సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు
** భారీ వర్షాలపై తిరుపతి ఎస్పీ హెచ్చరిక సూచనలు
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: వాయుగుండం వల్ల కురుస్తున్న భారీ వర్షాల పై సోషల్ మీడియాలో భయాందోళన కలిగించే ఫేక్ న్యూస్‌ను షేర్ చేయవద్దని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే రెండు మూడు రోజులు మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు.
ముఖ్య సూచనలు:-
పాడుబడిన భవనాలు, హోర్డింగ్ బోర్డులు, చెట్లు లేదా విద్యుత్ తీగల దగ్గర ఉండవద్దు…వాగులు, వంకలు, చెరువులు, నదులు, లోతైన నీటి గుంటల వద్దకు వెళ్లవద్దు…
అవసరంలేకుండా బయటకు రాకండి — రోడ్లపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట ప్రయాణించవద్దు.
కాలువలు, వాగులు ప్రవహిస్తున్నప్పుడు ఎంత అత్యవసరం అయినా బైక్‌లు లేదా కార్లతో దాటకండి. రీల్స్ లేదా సెల్ఫీలు తీసుకోవద్దు.
తల్లిదండ్రులు పిల్లలను నీటి ప్రాంతాల వద్ద ఆడనీయకుండా జాగ్రత్తపడాలి. వర్షకాలంలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగవచ్చు. ఎక్కడైనా చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం లేదా వాగులు పొంగిపోవడం వంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112 సేవను వినియోగించుకోవాలని, ప్రజలు పోలీస్ వారి సూచనలను తప్పక పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.
