ఈడీకి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని ముఖ్యాంశాలివే
మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హరిస్తున్నదని, వాటిని కాపాడుకునేందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు.
ఈడీ అధికారులు తనకు చెప్పకుండానే మొబైల్ ఫోన్ తీసుకున్నారని ఆక్షేపించారు. మొబైల్ ఫోన్ అనేది వ్యక్తిగత గోప్యత హక్కు అని గుర్తుచేశారు.
ఈ నెల 24న సుప్రీంకోర్టు తమ పిటిషన్‌ను విచారించనున్నదని, తీర్పు వచ్చే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో అధికారులు కోరిన పత్రాలతోపాటు ఒక లేఖను ఆమె తన ప్రతినిధి ద్వారా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు పంపించారు. తనకు పంపిన నోటీసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొనలేదని, దీంతో తన ప్రతినిధి సోమా భరత్‌కుమార్ ద్వారా ఈడీ కోరిన పత్రాలను పంపిస్తున్నానని ఆ లేఖలో స్పష్టంచేశారు. ఈ లేఖను బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమాభరత్‌కుమార్ ఈడీ కార్యాలయంలో అందజేశారు.
- మీరు 7న తాఖీదులు ఇచ్చారు. ఒక మహిళను ఆఫీస్‌కు పిలువరాదని చట్టంలో స్పష్టంగా ఉన్నదని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆడియో/వీడియో విధానంలో విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. లేదా అధికారులే మా ఇంటికి వచ్చి విచారణ జరుపొచ్చని ఆహ్వానించాను. మీరు నా విన్నపాన్ని అంగీకరించలేదు. ‘ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని మీ వ్యక్తిగత హాజరు ద్వారానే నిర్ధారించాలి. కాబట్టి విచారణను వాయిదా వేయాలని లేదా ఇంటి వద్ద విచారించాలన్న మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాను’ అని నాకు సమాధానం ఇచ్చారు.
- ఈ నెల 8న నేను ఇచ్చిన వివరణలో చట్టంలో ఉన్న నిబంధనలను స్పష్టంగా వివరించినప్పటికీ.. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని పట్టుబట్టారు. విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ నెల 11న మీ కార్యాలయానికి వచ్చాను.
- ఈ నెల 11న జరిగిన విచారణలో నాకు తెలిసిన అన్ని విషయాలను అధికారులకు వివరించాను. అన్ని ప్రశ్నలకు నాకు అవగాహన ఉన్నంతవరకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చాను. నాకు ఇచ్చిన తాఖీదుల్లో ఎక్కడా నా ఫోన్‌ను తీసుకొని రావాలని సూచించలేదు. అయినా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నా ఫోన్ తీసుకున్నారు. నా ఫోన్‌కు, ప్రస్తుతం జరుగుతున్న విచారణకు ఉన్న సంబంధం ఏమిటో వివరించలేదు. మొబైల్ విషయంలో మీరు పీఎంఎల్ చట్టంలోని సెక్షన్ 50(5)ను ప్రయోగించాలని చూస్తున్నారు. మొబైల్ ఫోన్ అనేది వ్యక్తిగత గోప్యత హక్కు కిందికి వస్తుందని మీకు గుర్తు చేస్తున్నాను.
- విచారణ సందర్భంగా నన్ను సూర్యాస్తమయం అయినా విడిచిపెట్టకుండా, రాత్రి 8:30 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచారు. ఆ తర్వాత 16వ తేదీన హాజరు కావాలంటూ తాఖీదులు ఇచ్చారు.
- నేను వ్యక్తిగతంగా హాజరుకావాలా? ప్రతినిధిని పంపాలా? అనే అంశాన్ని ఆ తాఖీదుల్లో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి నేను ఈరోజు (16-03-23) నా తరఫున బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్‌ను నా ప్రతినిధిగా మీ దగ్గరికి పంపుతున్నాను. ఆయన ఈ లేఖతోపాటు కొన్ని డాక్యుమెంట్లను మీకు అప్పగిస్తారు.
- విచారణకు సహకరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిర్ధారించాలనే కారణంతో నన్ను ఈ నెల 11న విచారణకు పిలిచినా, అక్కడ అలాంటి ప్రక్రియ నిర్వహించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా.. ‘ప్లాన్ మార్చుకున్నాం’ అని భానుప్రియ మీనా అనే అధికారి సమాధానం ఇచ్చారు.
- ఈ పరిణామాలన్నీ విచారణ పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదని నేను బలంగా నమ్మేలా చేస్తున్నాయి.
- నా ప్రాథమిక హక్కులను హరిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన చట్టబద్దమైన రక్షణ కోసం నేను సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాను. ఆర్టికల్ 32 ప్రకారం రిట్ దాఖలు చేశాను.
- నాకు ఇచ్చిన తాఖీదులు సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధమని, పిటిషనర్ తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని, మొత్తం ప్రక్రియను ఆడియో/వీడియో రికార్డింగ్ చేయాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొన్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాను. పలు న్యాయపరమైన అంశాలను న్యాయస్థానం ముందు ఉంచాను.
- నాకు చట్టపరంగా ఉన్న మినహాయింపులు కల్పించాలని, నాపై ఈడీ బలవతంగా ఎలాంటి చర్య తీసుకోకుండా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
- నేను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ నెల 15న భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
- ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు. కాబట్టి తీర్పు వచ్చే వరకు ఈ కేసులో నాకు ఇచ్చిన తాఖీదులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నాను.
- ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్‌కు పిలువొచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో 2018లో ఎస్‌ఎల్పీ (నంబర్ 19275-76) దాఖలయ్యింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతున్నది. అయితే.. ఈ కేసులో పిటిషనర్‌ను కచ్చితంగా హాజరుకావాలని పట్టుబట్టబోమని కోర్టుకు ఏజెన్సీ హామీ ఇచ్చింది. ఒక మహిళగా అదే వెసులుబాటు నాకు కూడా వర్తిస్తుందని మీకు గుర్తు చేస్తున్నాను.
- నేను నా జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేశానని, ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తానని ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. దేశంలోని ఏ ఒక్క మహిళ కూడా తన హక్కులను కోల్పోకుండా కాపాడటం ఒక మహిళా నాయకురాలిగా, దేశ పౌరురాలిగా నా బాధ్యతగా భావిస్తాను. అలాంటిది నా హక్కులనే హరించే పరిస్థితి వస్తే.. వాటిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలను కచ్చితంగా తీసుకుంటాను.
- మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- ఏది ఏమైనా.. మీరు సూచించిన మేరకు నా ప్రతినిధిగా సోమా భరత్‌కుమార్‌ను మీ దగ్గరికి పంపుతున్నాను. ఈ వినతిపత్రంతోపాటు నా బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వ్యక్తిగత, వ్యాపార వివరాల పత్రాలను పంపిస్తున్నాను. వీటిని పరిశీలించి, ఇంకా ఏమైనా అదనపు సమాచారం కావాలంటే నా ప్రతినిధిని గానీ లేదా నేరుగా నాకు మెయిల్ చేయడం ద్వారా సంప్రదించగలరు.