విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత ఉండొద్దు…
రోజుకు 28–32 రేకుల బొగ్గు రవాణా చేయాలి…
— సింగరేణి సీఎండీ డా.బుద్దప్రకాశ్ జ్యోతి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:హైదరాబాద్, : రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా అన్ని ఏరియాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సీఎండీ డా. బుద్దప్రకాశ్ జ్యోతి ఆదేశించారు. థర్మల్ కేంద్రాల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిరోజూ 28 నుంచి 32 రేకుల ద్వారా నాణ్యమైన బొగ్గు రవాణా చేయాలని సూచించారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌బర్డెన్ తొలగింపు, నాణ్యత తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ మాట్లాడారు.
వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ గనుల ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినా, ముందస్తు ప్రణాళికతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు. అదే సమయంలో వర్షాకాలంలో భూగర్భ గనుల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం 75 నుంచి 80 శాతం బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా బొగ్గు రవాణా నిరంతరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సింగరేణి రెస్క్యూ బృందాలు, ఇతర విభాగాల అధికారులు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అన్ని ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ తొలగింపు లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త గనులకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (పీ అండ్ పీ), గౌతమ్ పోట్రు (పర్సనల్ & ఫైనాన్స్), ఎం. తిరుమలరావు (ఈ&ఎం), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
