రామగుండం అభివృద్ధిలో జాప్యానికి తావులేదు…
జూలై రెండో వారానికల్లా మెజారిటీ పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని, మంజూరైన ప్రతి పనిని వేగంగా ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె. అరుణశ్రీతో కలిసి రామగుండం అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డీఎంఎఫ్‌టీలో నిధుల కొరత లేకపోయినా స్మశానవాటికలు, మహిళా శక్తి భవనాలు, విద్యాసంస్థల అభివృద్ధి, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక సదుపాయాల పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఇంజినీరింగ్ అధికారి క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేపట్టి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మహిళా సంఘ భవనాల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియలో జాప్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. రూ.5 లక్షల విలువైన చిన్న పనులు కూడా ఏడాది గడిచినా పూర్తికాకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ, జూలై రెండో వారానికల్లా మెజారిటీ అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కోర్టు భవనం నిర్మాణానికి సంబంధించిన సవరించిన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ అంచనాలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు.
2 బీహెచ్‌కే గృహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విద్యుత్, సెప్టిక్ ట్యాంకులు, తాగునీటి వంటి మౌలిక వసతుల పనులను వారంలోగా పూర్తి చేసి, ఇప్పటికే పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి గృహ ప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్లు జారీ చేయాలని కూడా ఆదేశించారు.
రామగుండంలోని విద్యాసంస్థల్లో మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, నరేగా ద్వారా చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను జూన్ 30లోపు పూర్తి చేసి బిల్లులు క్లెయిమ్ చేయాలని సూచించారు. నరేగా నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి అవసరమైతే మంజూరు రద్దుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మిగిలిన గృహాల మంజూరుకు అవసరమైన సర్వే పూర్తి చేసి ఒకే రోజు పెద్దఎత్తున మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రామగుండం నగరంలో గృహ నిర్మాణాలు, తాగునీటి పనులు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను ప్రాధాన్యతగా పూర్తి చేయాలని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నాయని, వాటిని వెంటనే గ్రౌండ్ చేసి అమలు దశకు తీసుకురావాలని సూచించారు.
నగర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి నెల రూ.2 కోట్ల వరకు పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ రహదారులపై చెత్త కనిపించడం అంగీకారయోగ్యం కాదన్నారు. రామగుండంలో ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా పరిశుభ్రత, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
