ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలి….
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
ఈ నెల జూన్ 28న ‘పోలియో బూత్ డే’ నిర్వహించనున్నట్లు, అనంతరం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు 62,902 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
పోలియో చుక్కల పంపిణీ కోసం జిల్లాలో 381 పోలియో బూత్‌లు, 25 మొబైల్ బృందాలు, 24 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి చిన్నారుల వివరాలను సేకరించాలని సూచించారు.
ముఖ్యంగా వలస కూలీలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగ కార్మికుల పిల్లలు పోలియో కార్యక్రమానికి దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్రయాణికుల చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
