భూ పునఃసర్వేలో జాప్యానికి తావులేదు….

Sakshitha news

భూ పునఃసర్వేలో జాప్యానికి తావులేదు….

ఆగస్టు 10లోగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి….

— కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి/
జిల్లాలో చేపడుతున్న భూముల పునఃసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో కలిసి రెవెన్యూ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లైసెన్స్ పొందిన పునఃసర్వేయర్ రోజువారీ లక్ష్యాలను సాధిస్తూ కనీసం 45 ఎకరాల భూమిని సర్వే చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

భూ భారతి కింద వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి అర్హుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తుల విషయంలో సంబంధిత దరఖాస్తుదారులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ సాదాబైనామా కింద క్రమబద్ధీకరించవద్దని అధికారులకు ఆదేశించారు.

మీసేవ ద్వారా వచ్చే ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా సేవలు అందించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్, ప్రతి అర్హ ఓటరుకు ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎఫ్‌ఆర్‌సీ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు.

మ్యుటేషన్లు, వారసత్వ మార్పిడులు, భూ రికార్డుల సవరణలు, అప్పీళ్ల పరిష్కారం వంటి రెవెన్యూ సేవలను జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి నుంచి భూ భారతికి మారిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. గంగయ్య, సురేష్, తహసీల్దార్లు, సర్వే మరియు భూ రికార్డుల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top