రెండోసారి మరింత బాధ్యత పెంచింది
** టీటీడీ నూతన ఈఓ సింఘాల్
సాక్షిత ప్రతినిధి – తిరుమల: తిరుమల స్వామివారి సన్నిధిలో ఈఓగా సేవచేసే అవకాశం రెండోసారి రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని నూతన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీ అండ్ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. సింఘాల్ తో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
అనంతరం ఈవో సింఘాల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు – మూడు సంవత్సరాల నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుంచి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు.., సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని సింఘాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, కస్తూరిబాయి, నాగరత్న, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
