ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం సింగరేణి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వడ దెబ్బ బాధితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే వడగాలుల తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా పెరిగిన ఎండల కారణంగా.. వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. 20 రోజుల నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే.. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ముఖ్యంగా వడగాలులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. పది నిమిషాలు బయటకు వస్తే.. అస్వస్థతకు గురవుతున్నారు. వడ దెబ్బతో మంచం పడుతున్నారు.
పెరిగిన ఎండల కారణంగా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు కూడా పని చేయాలంటే భయపడుతున్నారు. అదే విధంగా సింగరేణి నిప్పుల కొలిమిలా తయారైంది. పెరిగిన ఎండల కారణంగా గనుల్లో పనులకు దిగాలంటే కార్మికులు భయపడుతున్నారు. ఈసారి ఎండల మరింత పెరిగే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే పెరిగిన ఎండల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నెల రోజుల క్రితం వడగండ్ల వాన, ఆకాల వర్షాలు కురిశాయి. తరువాత ఒక్కసారి ఎండ తీవ్రత పెరిగింది. ఎండతో పాటు ఉక్కబోత భరించలేకపోతున్నారు నగరవాసులు. ఈ వారం రోజుల నుంచి ఎండలు పెరిగిపోతున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో బయటకు రాలేకపోతున్నామని తెలుపుతున్నారు. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. తొందరగా అలిసిపోతున్నామని చెబుతున్నారు.