SAKSHITHA NEWS

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొన్ని గంటలలో కొలువు తీరనున్నది. ఈ తరుణంలో కీలక స్థానాలలో ఎవరు ఉండబోతున్నారు అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో కీలకమైన అడ్వకేట్ జనరల్ ఎవరు అని హైకోర్టు కారిడార్లు, క్యాంటీన్లు, న్యాయవాదుల ఛాంబర్లలోనే కాదు ప్రభుత్వ వర్గాలు, ప్రజలలో కూడా చర్చంనీయాంశం అయ్యింది. ప్రభుత్వం తరుపున మొదటి లాయర్ న్యాయ కోవిదుడు, ప్రజల మేలు కోరేవాడు ఉండాలనేది అందరి ఆకాంక్ష. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన న్యాయవాదులందరు ఉద్యమ ఆకాంక్షలు తెలిసినవాడు, తమతో ఉద్యమంలో ఉన్నవాడు ఆ కుర్చీలో కూర్చోవాలి అని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాది పి. నిరూప్ రెడ్డి.

పి. నిరూప్ సుప్రీమ్ కోర్టు లో గత మూడు దశాబ్దాలుగా న్యాయవాదిగా తన సేవలు అందిస్తున్నారు. సుప్రీమ్ కోర్టు ఏర్పడిన నాటి నుండి తెలంగాణ నుండి సీనియర్ న్యాయవాది గా గుర్తించబడిన మొదటి న్యాయవాది ఇతను. 1986 లో న్యాయవాద వృత్తిలోకి వచ్చి తన తండ్రి అయిన ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్, ఐదు దఫాలుగా ఎం.ఎల్.ఏ గా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పి. రామచంద్ర రెడ్డి దగ్గర సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది గా పనిచేసి ఆ తరువాత కొన్ని సంవత్సరాలు హై కోర్టు న్యాయవాదిగా, అడ్వకెట్ జనరల్ కార్యాలయం లో ప్రత్యేక జి.పి గా పనిచేశారు. ఆ తరువాత వీరు సుప్రీమ్ కోర్టులో మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫీసులో జూనియర్ గా చేరాడు. 1992 నుండి సొంత ప్రాక్టీసు ప్రారంభించి మంచి గుర్తింపు పొందారు. గత సంవత్సరం వీరిని సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాది గా గుర్తింపు ఇచ్చింది. తెలంగాణా నుండి ఈ గుర్తింపు పొందిన మొదటి న్యాయవాది.

పి. నిరూప్ తెలంగాణ ఉద్యమంలో విశేష కృషి చేసారు . ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. మలిదశ ఉద్యమ కాలమంతా వారానికి రెండు రోజులు తెలంగాణ లోనే ఉంటూ స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు.

వీరు మేఘాలయ రాష్ట్రానికి అదనపు అడ్వకేట్ జనరల్ గా, గోవా రాష్ట్ర సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు.

తెలంగాణ లో ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ పరిపాలనలో మార్పుకు బలంగా కృషి చేశారు.

తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప న్యాయవాది, అనుభవజ్ఞుడు, మేధావి, ప్రజల మేలుకోరే నిరూప్ అడ్వకేట్ జనరల్ కావాలన్నది అందరి కోరిక.

Whatsapp Image 2023 12 06 At 1.51.21 Pm

SAKSHITHA NEWS