లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ రోడ్డులోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఓల్డ్ రాధా స్వామి సత్సంగ్ భవన్‌లో సహరాన్‌పూర్‌లోని బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్, ఆ పార్టీ కైరానా అభ్యర్థి ప్రదీప్ చౌదరికి మద్దతుగా సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ తో పొల్చిన ప్రధాని మోదీ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ముస్లిం లీగ్‌లో ఉన్న ఆలోచననే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తిగా ముస్లిం లీగ్ ముద్ర ఉంది. ఈ ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలోని మిగిలిన భాగాలపై వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి..’’ అంటూ ప్రధాని మోదీ విమర్శించారు.
రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లపై ప్రధాని విరుచుకుపడ్డారు. యూపీకి చెందిన ఇద్దరు కుర్రాళ్ల ఫ్లాప్ సినిమా మళ్లీ విడుదలైందంటూ ఎద్దెవా చేశారు. వాళ్లిద్దరిని ఎవరూ పట్టించుకోరంటూ పేర్కొన్నారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తామంటూ పేర్కొన్నారు. ఇండియా అలయన్స్ కమీషన్ల కోసమేనంటూ పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు.