SAKSHITHA NEWS

మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలి
-జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

వేములవాడ, : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకర భాష నియంత్రణకు మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వేములవాడలోని మున్నూరుకాపు సంఘం భవన్ లో టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభ జరిగింది. ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కాకుండా ప్రజల పక్షం, పాత్రికేయుల పక్షం ఉండాలని, అదే లక్ష్యంతో ఏర్పడిన ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ నెంబర్ వన్ యూనియన్ గా బలపడుతుందని, రాబోయే కొద్దిరోజుల్లో అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ జరుపుతామని అన్నారు.
ఐఏఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, రాజన్న-సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. వేములవాడ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ మహాసభ తీర్మానించింది.

వేములవాడ నియోజకవర్గ కమిటీ ఎన్నిక…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా సుంకరి నరేందర్, కోశాధికారిగా బోప్ప బిక్షపతి, ఉపాధ్యక్షులుగా అవధూత శ్రీధర్, కవ్వాల సురేందర్, ఎండి షరీఫ్, సహాయ కార్యదర్శులుగా గొల్లపల్లి వేణు, కోటగిరి రాజశేఖర్, గోపు ప్రవీణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు చల్లా రమేష్, వాసం వెంకటస్వామి, ఎగుమంటి మూర్తి రెడ్డి, కళ్యాడపు వెంకటమల్లు, చక్రహరి దేవేందర్ రాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నడిగట్ల బిక్షపతి, సయ్యద్ షబ్బీర్ లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.