SAKSHITHA NEWS

తిరుపతి దుర్ఘటనకు భాద్యులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది : మాజీ మంత్రి ప్రత్తిపాటి.

తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన సంక్రాంతి పర్వదిన సమయంలో తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలోని భైరాగిమిట్ల టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన దుర్ఘటనలో 6 గురు మృతి చెందడం, 40 మందికి పైగా గాయాలపాలవడం దురదృష్టకరమని, ఘటనకు గల కారణాలు నిగ్గుతేల్చి, తప్పుచేసినవారిని ప్రజల ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేసిన మాజీమంత్రి, తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందేలా స్థానిక వైద్యసిబ్బంది, టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబసభ్యులు, వారి బంధువులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పనిలేదని మాజీమంత్రి ధైర్యం చెప్పారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ బహిరంగ సభ, రోడ్ షో భారీ స్థాయిలో విజయవంతమవడం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేలా ఆయన పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి, ఆంధ్రప్రదేశ్ పేరుప్రఖ్యాతులు ప్రపంచస్థాయిలో మారుమోగేలా చేసిన సమయంలో, తిరుపతి దుర్ఘటన జరగడం నిజంగా యావత్ దేశానికే విచారకరమని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS