ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది…

Sakshitha news

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వార్డు సభలో మేయర్ మహంకాళి స్వామి…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 10, 11, 39, 40, 41, 42, 43, 52, 53, 54, 55, 56, 57, 58 డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ లెవెల్ వార్డు సభను బుధవారం కళ్యాణ్ నగర్‌లోని రాజస్థాన్ భవన్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీ గ్యాస్ వంటి అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ఇతరులకు చెప్పాలని కోరారు.

రామగుండం నగర అభివృద్ధి కోసం నిరంతరం మంత్రులను కలిసి నిధులు తీసుకువస్తున్నామని, కేవలం రెండేళ్లలోనే వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కాలువల పూడికతీత పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలు వైద్య, ఆరోగ్య, పోలీస్, మునిసిపల్ శాఖల అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. నగరాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కాలుష్య నియంత్రణ కోసం విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఇంకుడు గుంతలు తవ్వాలని, నగర అభివృద్ధికి ప్రజల సూచనలు స్వాగతిస్తామని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్ బెట్టింగులు, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు.
డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రామగుండంలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేయర్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే డివిజన్లలో పర్యటిస్తూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎలాంటి విపత్తులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేలాడుతున్న విద్యుత్ తీగలు, శిథిలావస్థలో ఉన్న స్తంభాలపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పాటిస్తూ చెత్తను వేర్వేరుగా విభజించి ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా సర్‌పై ఎంఆర్వో రవీందర్ వివరాలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు, హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతపై అడ్డగుంటపల్లి మెడికల్ ఆఫీసర్ స్నేహలత అవగాహన కల్పించారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ట్రాన్స్‌కో ఏఈ జమీల్ పాషా వివరించారు.

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్ రావు, శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివారణపై వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కల్పించారు.

అంగన్‌వాడీ కార్యకలాపాలపై సీడీపీవో ఆలేఖ్య, ఇంకుడు గుంతల నిర్మాణంపై ఏసీపీ శ్రీహరి, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలపై డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి వివరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మేప్మా సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.

Scroll to Top