“సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో ఘనత…
పర్యావరణ పరిరక్షణకు కేంద్రం ప్రశంస
సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి…
పర్యావరణ ప్రమాణాల అమలుకు కేంద్రం నుంచి ప్రశంసలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:హైదరాబాద్,
బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్‌కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా, గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు రూ.40 కోట్ల సొమ్మును వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సి సి ఓ) సింగరేణికి తిరిగి చెల్లించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకత్వంలో సింగరేణి చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు లభించిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నారు.
గని ప్రారంభం నుంచి మూసివేత వరకు అమలు చేయాల్సిన మైన్ క్లోజర్ ప్లాన్, భూసంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు, కాలుష్య నియంత్రణ చర్యలను సింగరేణి సంస్థ కచ్చితంగా అమలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్, గతంలో డిపాజిట్ చేసిన నిధులను వడ్డీతో సహా తిరిగి విడుదల చేసింది.
డోర్లీ-2 గని మూసివేత ప్రక్రియలో సింగరేణి చూపిన బాధ్యతాయుత వైఖరి, పారదర్శకత, పర్యావరణహిత చర్యలు, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన తీరు సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది. గనుల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర మైనింగ్ విధానాలను అమలు చేస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి నిలిచింది.
ఎస్క్రో డిపాజిట్ అంటే ఏమిటి?
కొత్తగా గనిని ప్రారంభించే సమయంలో ఆ గని జీవితకాలంలో చేపట్టాల్సిన పర్యావరణహిత చర్యలు, గని మూసివేత తర్వాత అమలు చేయాల్సిన పునరుద్ధరణ పనుల కోసం అయ్యే ఖర్చును అంచనా వేసి, ఆ మొత్తాన్ని ముందస్తు డిపాజిట్ రూపంలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. గని జీవితకాలం పూర్తయ్యాక అన్ని నిబంధనలను సక్రమంగా అమలు చేసినట్లు తేలితే ఆ డిపాజిట్‌ను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు.
డోర్లీ-2 గనికి సంబంధించి సింగరేణి సంస్థ 2013-14లో సుమారు రూ.26.79 కోట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్క్రో డిపాజిట్‌గా జమ చేసింది. ఈ గని ఏడు సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసి 2023-24లో మూసివేయబడింది.
గని మూసివేత అనంతరం చేపట్టిన పర్యావరణ చర్యలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) సంస్థ ద్వారా 2024 జూలైలో పరిశీలించారు. అన్ని పనులు నిబంధనలకు అనుగుణంగా జరిగాయని ధృవీకరించడంతో, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వడ్డీతో సహా డిపాజిట్ మొత్తాన్ని విడుదల చేసింది.
మొత్తం రూ.40 కోట్లలో తొలి విడతగా రూ.36.63 కోట్లను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే తమ లేఖలో పేర్కొన్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని ‘జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్’ పరిశీలన అనంతరం చెల్లించనున్నట్లు తెలిపారు.
సింగరేణి అమలు చేసిన ప్రధాన పర్యావరణ చర్యలు
డోర్లీ ఓపెన్‌కాస్ట్-2 గని ప్రాంతంలో 162.517 హెక్టార్లలో దట్టమైన అడవులను అభివృద్ధి చేసింది.
టాప్ సాయిల్‌ను భద్రపరచి తిరిగి డంపులపై పరిచి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది.
ధూళి కాలుష్య నియంత్రణ కోసం డస్ట్ కలెక్టర్లు, వెట్ డ్రిల్లింగ్, వాటర్ స్ప్రింక్లర్లు, మిస్ట్ స్ప్రేయర్లు వినియోగించింది.
హాల్ రోడ్ల వెంట గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసింది.
జల కాలుష్య నివారణకు గార్ల్యాండ్ డ్రైనేజీలు, చెక్ డ్యామ్‌లు, సెటిలింగ్ ట్యాంకులు నిర్మించింది.
గని మూసివేత అనంతరం రక్షణ చర్యలు, ఫెన్సింగ్, భవనాల సురక్షిత తొలగింపు చేపట్టింది.
ఈ చర్యలన్నింటినీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ఆడిట్ చేయించి విజయవంతంగా పూర్తి చేసినందుకే సింగరేణికి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న గని మూసివేత చర్యలకు ఇదే నిదర్శనమన్నారు. గతంలో శ్రీరాంపూర్ ఆర్కే-8 ఇంక్లైన్ గనికి సంబంధించి కూడా రూ.4 కోట్ల డిపాజిట్ తిరిగి పొందినట్లు గుర్తు చేశారు.
ఇంకా మూసివేత దశలో ఉన్న మరికొన్ని గనుల్లో కూడా పర్యావరణహిత చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో డోర్లీ-1 గనికి సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్ సొమ్ము తిరిగి వచ్చే అవకాశముందని తెలిపారు.
