ప్రభుత్వాసుపత్రిలో వసతులు మెరుగుపర్చాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు
ప్రభుత్వాసుపత్రి అభివృద్దికి నెరవేరని మాజీ మంత్రి రజిని హామీ
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట:
చిలకలూరిపేట ప్రాంత ప్రజలకే కాకుండా సమీపంలో బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలకు సేవలు అందిస్తున్న 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో వసతులు మెరుగుపర్చాలని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు మందకొడిగా సాగాయని, ఎన్నికలకు ముందు వసతులు ఏర్పాటు చేయకుండా హడావిడిగా ప్రారంభించారని గుర్తు చేశారు.
మాజీ మంత్రి రజిని హామీ నెరవేరలేదు..
ఆసుపత్రి ప్రారంభం రోజు మాజీ మంత్రి విడదల రజిని ఆసుపత్రి చూట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి అంతర్గత రోడ్లు, జనరేటర్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ వసతులు సమకూరలేదన్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్ నిలిచిపోతే రోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ప్రహరీ గోడ నిర్మాణం లేకపోవడంతో కుక్కలు, విషసర్పాలు ఆసుపత్రిలోకి వస్తున్నాయని వెల్లడించారు. దీంతో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో చిలకలూరిపేటతో పాటు సమీపంలో జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులను 100 పడకల ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తున్నారని, అయితే ట్రామా సెంటర్ లేకపోవడంతో ఇక్కడి నుంచి గుంటూరుకు తరలించాల్సి వస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులను గుంటూరుకు తరలించేలోపే మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు. దీంతో పాటు మరణించినవారిని భద్రపరిచేందుకు సరైన వసతులు కూడా లేవని తెలిపారు. ప్రభుత్వం ప్రభుత్వాసుత్రిలో వసతులు మెరుగుపరిచి, వైద్య సిబ్బందిని నియమించి రోగుల ఇబ్బందులు తొలగించాలని బాలాజి కోరారు.