SAKSHITHA NEWS

జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయో వృద్ధుల దినోత్సవం కార్యక్రమానికి కలక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 నుండి వయో వృద్ధుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించిన 26వ తేదీన ఆర్డీఓ కార్యాలయంలో వయో వృద్ధుల హక్కుల పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. 27న మారథాన్ వాక్, 28 న ఆర్డీఓ కార్యాలయంలో సర్పంచులు, వయో వృద్ధులకు వారికి ఉన్న హక్కులు చట్టాల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 30 వ తేదీన అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్దలను గౌరవించే సంస్కార కార్యక్రమం తో పాటు ఈ వారం రోజుల్లో చేస్, వయో వృద్ధులకు చేస్, క్యారం బోర్డు వంటి ఆటల్లో పోటీలు నిర్వహించారు.


ఈరోజు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా కలక్టర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యంత్రాంగం వృద్ధులకు అండగా ఉంటుందని, పిల్లలకు సంరక్షణ బాధ్యతలు తీసుకోకుంటే ఆర్డీఓ ద్వారా వారి భూమిని తిరిగి తీసుకొని వృద్ధులకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. వయో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పింఛను ఇవ్వడం జరుగుతుందని, పెన్షన్ దారుడు అయిన భర్త లేక భార్య మరణిస్తే వెంటనే తన పెన్షన్ ను భార్యకు గాని భర్తకు గాని వెంటనే బదిలీ చేసి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకుల్లో వయో వృద్ధులకు ఫిక్స్ డ్ డిపాజిట్, ఇతర సేవింగ్ పాలసీలు ఉంటాయని వాటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నడక వ్యాయామం చేయడం, సంతోషంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆయుష్ మందులు వాడటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.


అనంతరం సమాజంలో సామాజిక సేవలు అందిస్తున్న వయో వృద్ధులకు శాలువాలతో సన్మానం చేశారు. చేస్, క్యారమ్ బోర్డులో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేశారు.
సామాజిక సేవలకు గుర్తింపుగా పి. నరసింహా గౌడ్, వి. సలేశ్వరం , కే. నాగన్న, జి. రాములు, బి. లచ్చన్న, సింగమలాలు, బి. రామిరెడ్డి, జి. చంద్రయ్య, రాంభూపాల్ శెట్టి, బాలయ్య, కమలమ్మ, యం. సుజాత, ప్రభాకర్ శెట్టి, యం. రామిరెడ్డి, యం. సూర్యనారాయణ, వేణాచారి, హమీద్ సన్మాన గ్రహీతల్లో ఉన్నారు.అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, జడ్పి సి. ఈ. ఒ యాదయ్య, డిప్యూటీ సి. ఈ. ఒ రామ మహేశ్వర్ రెడ్డి, ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి నుషిత, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు, రిటైర్డు ఉద్యోగులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి ద్వారా జారీ


SAKSHITHA NEWS