SAKSHITHA NEWS

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…..

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చింతకాని మండలంలో పర్యటించి సి.ఆర్.ఆర్. నిధులు సుమారు 22 కోట్ల 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, ఆఫీస్, స్టోర్ రూం భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో నాగిలిగొండ నుండి కొండవనమాల వరకు రూ. 4 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, నాగిలిగొండ నుండి గొల్లెనపాడు వరకు రూ. 7 కోట్ల 10 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, ఆఫీస్, స్టోర్ రూం భవనాన్ని ప్రారంభోత్సవం చేసారు. అలాగే జగన్నాధపురం లో వేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి రేపల్లేవాడ వరకు ఒక కోటి రూపాయలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగన్నాధపురం వరకు ఒక కోటి రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు, పందిళ్లపల్లిలో పందిళ్లపల్లి నుండి మత్కే పల్లి వరకు 8 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల కోసం ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, చాలా రోజుల తర్వాత పేద విద్యార్థుల గురించి ఆలోచించి కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి నిమిషం చాలా విలువైందని, ఒక నిమిషం కూడా వృధా చేయకుండా ఉరుకులు, పరుగులతో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్ గౌడ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్ డబ్ల్యూ.ఎస్. అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS