చీల్చిచెండాడుతా’అన్న కేసీఆర్‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..
తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని… అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘‘ఎన్నికలైపోయాయి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా’’ అంటూ సీఎం సెటైర్ విసిరారు.
అలాగే… కేటీఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లకు పోలిక ఉందని.. కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్నా పర్సెంట్ ఇంటిలిజెన్స్ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు ఓపిక, సహనం ఉండాలని సలహా ఇచ్చారు. కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు’’ అని అన్నారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారన్నారు
మేమేమీ మీలాగా చెప్పలేదు…
బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందన్నారు. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారని తెలిపారు. బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే తాము చెల్లించామన్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారని.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. ఎయిర్ పోర్టుకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం చేబితే వద్దని కేసీఆర్, కేటీఆర్ తిరస్కరించారన్నారు. ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు. తామెప్పుడు పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదని… హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదని అన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ రేపు ప్రారంభిస్తామన్నారు. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నామని… ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏషియన్ గేమ్స్ నిర్వహించిన హైదరాబాద్‌లో అన్ని స్టేడియంలు , ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి ఉందన్నారు. నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి గత బీఆర్‌ఎస్ సర్కార్ ఇవ్వలేదని మండిపడ్డారు. మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్1 ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. ఫార్మాసిటీ అని వాళ్లన్నారని.. తాము ఫార్మా విలేజ్‌లు అంటున్నామని తెలిపారు. వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్ నగరంగా ముచ్చర్ల…
సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్‌లతో పాటు నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని వెల్లడించారు. ముచ్చర్లలో నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మన భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతుందన్నారు. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తాం పెట్టుబడులు ఎవరు పెట్టాలన్నా ముచ్చర్లకి రావాలని కోరారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఒక్క పాలసీ ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్ పాలసీలు తీసుకొస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు..