తిరుపతిలో వైసీపీ మహిళా నాయకుల అరెస్టు సిగ్గుచేటు
** తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి
.
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: సూళ్లూరుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి ఢిల్లీ నుంచి స్పందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ఆయన ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయగా వారిని వదిలిపెట్టి, దాడిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. చట్టాన్ని వక్రీకరించి రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించడం తగదన్నారు. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం కలవకూరు గ్రామంలో ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అక్రమ కేసు నమోదు చేయడం, మాజీ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, గ్రామానికి చెందిన మరికొంత మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం దుర్మార్గమని ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు.
పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందేందుకు అక్రమ కేసులు బనాయించి వేధించే ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అన్యాయంగా నమోదు చేసిన అక్రమ కేసులను ఏ మాత్రం ఉపేక్షించబోమని, న్యాయస్థానాల ద్వారా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నిజంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జరిగే సంఘటనల్లో బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతూ, రాజకీయ కక్ష సాధింపుల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసుల్లో అరెస్టు ఆయిన వారికి పార్టీతోపాటు తామందరం అండగా ఉంటామని, పార్టీ న్యాయ విభాగం తరపున న్యాయ సహాయం అందిస్తామని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు దైర్యంగా ఉండాలని ఆయన కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY