ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం….
గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరిచిపోలేదని వ్యాఖ్య…
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత :పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి, గోదావరిఖని,
అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తోందని తెలిపారు.
ప్రజల ఆదరణ పొందుతున్న ప్రభుత్వంపై బురద చల్లే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు సింగరేణి బొగ్గు అంశం, కన్నెపల్లి అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థను బలహీనపరిచి దోపిడీకి గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిదేనని ఆరోపించారు.
వైద్య రంగానికి సంబంధించిన అక్రమాల వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలోనే అప్రమత్తత విభాగం విచారణ జరిపి అరెస్టులు చేసిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, ప్రజలే నిజానిజాలను గుర్తిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత పాలనకు భిన్నంగా ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.
రామగుండం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, ఉప మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
