ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించిన ,మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు వీక్షింపజేశారు. ఈ సందర్భంగా రైతులకు తెలంగాణ కంది–3 (టీడీఆర్‌జీ–59) విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభను రైతులు ఆసక్తిగా వీక్షించారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించారు. రైతు భరోసా నిధులు సకాలంలో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
అనంతరం వ్యవసాయ పరిశోధనా కేంద్రం, తాండూరు అభివృద్ధి చేసిన తెలంగాణ కంది–3 (టీడీఆర్‌జీ–59) విత్తనాలను మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్ రైతులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. సువర్ణరేఖ, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
