ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం….
చిన్నారులకు ఆటలు, పాటలతో అభ్యాసం అందించాలని సూచన…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత : పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి, జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యా పునాదులు అందించేందుకు ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో ప్రస్తుతం మొత్తం 110 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.
ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల అంకితభావం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నారులకు ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన అందించడం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.
ప్రతి రోజు సమయానికి పాఠశాలకు హాజరవుతూ చిన్నారులతో ఆసక్తికరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం అవసరమైన సహకారం ఏదైనా ఉంటే జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ ఓరియంటేషన్‌లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు సంబంధించిన పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని చిన్నారులకు బలమైన విద్యా పునాదులు వేయాలని కలెక్టర్ ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, జిల్లా అకాడమిక్ అధికారి షేక్, రిసోర్స్ పర్సన్స్, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
