విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని,
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేసి విద్యార్థులు, ప్రజలకు బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకే పరిమితం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి, అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి సంస్థలకు కాకుండా మహిళా సంఘాల ద్వారా అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసి, జీఓ నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి, అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు.
ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఆధునిక వసతులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్, మరుగుదొడ్లు, వంట షెడ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, బస్సు పాస్‌లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యాహక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీని అమలు చేయాలని కోరారు.
అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానం–2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుండ్ల లక్ష్మీప్రసన్న, తడిగొప్పుల అనుప్ సాయి, గుండ్ల సూర్యప్రకాశ్, అభిషేక్, వైశాలి, చైత్ర తదితరులు పాల్గొన్నారు.

