సన్న వడ్లలో అధిక దిగుబడే లక్ష్యం.. శాస్త్రీయ పద్ధతులతో వరి నారు నిర్వహించాలి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: అంతర్గాం,
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో సాగుచేసిన సన్న రకాల వడ్ల వరి నారుమడులను మండల వ్యవసాయ అధికారి కే. సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారుమడుల పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడి శాస్త్రీయ పద్ధతుల్లో వరి సాగు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు తదితర చీడపీడల నివారణ కోసం నారు తీయడానికి వారం రోజుల ముందు ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేయాలని సూచించారు. అలాగే నారుమడుల్లో తెగుళ్ల నివారణకు కార్బెండాజిమ్ + మ్యాంకోజెబ్ మిశ్రమ మందును పిచికారీ చేయాలని తెలిపారు.
అగ్గి తెగులు నివారణ కోసం లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మిల్లీలీటర్ల ఇసోప్రోథియోలేన్ మందును కలిపి పిచికారీ చేయాలని రైతులకు వివరించారు.
16 నుంచి 30 రోజుల వయస్సు గల లేత వరి నారును మాత్రమే నాటుకోవాలని, నాటు వేయడానికి ముందు నారు కొనలను స్వల్పంగా కత్తిరించి నాటితే మొక్కల పెరుగుదల మెరుగ్గా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తూర్పు–పడమర దిశలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పుతో కాలిబాటలు ఏర్పాటు చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా ప్రసరించి చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే. సతీష్ కుమార్‌తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
